AP Assembly Sessions: ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ.. 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్..

Assembly sessions: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

AP Assembly Sessions: ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ.. 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్..
Apassembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం నుంచి ఎలక్టోరల్ కాలేజ్‌లో సభ్యులుగా ఉన్న ఎంపీలు – ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే పోలింగ్ సెంటర్‌లో వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరుసటి రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను చేపట్టనున్నారు. ఈ సమావేశాలు 23 వరకు కొనసాగనున్నాయి.

18న రాష్ట్రపతి ఎన్నిక..

ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు తమ మద్దతు తెలిపింది. తెలుగు దేశం పార్టీ సైతం ముర్ముకే మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. కానీ, ఇప్పటి వరకు టీడీపీ ఈ విషయం పైన అధికారికంగా తమ నిర్ణయం ప్రకటించలేదు. ఈ నెల 19న బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందులో సభను ఎప్పటి వరకు నిర్వహించేదీ.. షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజున శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కొత్త డిప్యూటీ స్పీకర్ గా ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్ర స్వామిని ఖరారు చేసారు.

ఇదిలావుంటే మంత్రి వర్గ ప్రక్షాళనలో భాగంగా వైశ్య కమ్యూనిటీ నుంచి ఎవరికి పదవి దక్కక పోవడంతో వారికి డిప్యూటి స్పీకర్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్ల భేటీలను 18న లేదా 19న నిర్వహించి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం 10-12 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడేళ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.