Bhagwant Mann: నిరాడంబరంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం.. హాజరైన ఆప్ అధినేత కేజ్రీవాల్

ఎటువంటి బాజాభజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా చండీగఢ్‌లోని సెక్టార్‌ 2లోని సీఎం నివాసంలో మాన్ - కౌర్ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం మాన్‌, కౌర్‌ను ఒక్కటయ్యారు.

Bhagwant Mann: నిరాడంబరంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం.. హాజరైన ఆప్ అధినేత కేజ్రీవాల్
Bhagwant Mann

Punjab CM Bhagwant Mann marries Dr Gurpreet Kaur: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం నిరాడంబరంగా జరిగింది. భగవంత్ మాన్ గురువారం హర్యానాలోని కురుక్షేత్ర పెహోవాకు చెందిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఎటువంటి బాజాభజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా చండీగఢ్‌లోని సెక్టార్‌ 2లోని సీఎం నివాసంలో మాన్ – కౌర్ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం మాన్‌, కౌర్‌ను ఒక్కటయ్యారు. ఈ వేడుకకు భగవంత్ మాన్‌ తల్లి, సోదరి, అతి కొద్ది మంది కుటుంబ సభ్యులతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా హాజరయ్యారు. పెళ్లి వేడుకకు సంబంధించి కొన్ని ఫొటోలను ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటోల్లో భగవంత్‌ మాన్‌ బంగారు వర్ణం కుర్తా ధరించగా.. కౌర్‌ ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోయారు.

వధువు డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌ కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 32 ఏళ్లు. ఆమె తండ్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఓ రైతు కాగా.. తల్లి మాతా రాజ్‌ కౌర్‌ గృహిణి. గుర్‌ప్రీత్‌ ఇద్దరు సోదరిలూ విదేశాల్లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ముల్లానా వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన గుర్‌ప్రీత్‌ కౌర్‌.. బంగారు పతకం కూడా సాధించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె భగవంత్‌ మాన్‌కు ఎంతగానో సహాయం అందించినట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి