Maharashtra: ఉద్ధవ్‌ థాక్రేకు మరో షాక్.. షిండే గ్రూపులోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు..

థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) గ్రూపులో చేరారు.

Maharashtra: ఉద్ధవ్‌ థాక్రేకు మరో షాక్.. షిండే గ్రూపులోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు..
Thane Municipal Corporation

Maharashtra Politics: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) కు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) గ్రూపులో చేరారు. ఈ మేరకు మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్‌లోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ షిండే గ్రూపులో చేరినట్టు ప్రకటించారు. సీఎం షిండే నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని కార్పొరేటర్లు వెల్లడించారు. బీఎంసీ (బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌) తర్వాత అతి కీలకమైన మున్సిపల్‌ కార్పొరేషన్‌ థానే. అయితే.. ఇక్కడ శివసేన నుంచి గెలుపొందిన 67 మందిలో 66 మంది షిండే గ్రూపులోకి వెళ్లడంతో ఉద్ధవ్‌ పార్టీ అక్కడ పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ లో ఒక్కరు మాత్రమే మిగిలిఉన్నారు.

సీఎంగా షిండే బాధ్యతలు..

ఇదిలాఉంటే.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మరికొంతమంది నాయకుల సమక్షంలో ఆయన సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాగా.. ఇప్పటివరకు ఉద్ధవ్‌కు అనుకూలంగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా షిండే వర్గంలోకి వెళ్లే అవకాశముందని రెబల్ నేతలు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..