Milling Rice Row: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ.. మిల్లుల వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలు..

Telangana Paddy Procurement Row: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య కయ్యం రైస్‌ మిల్లర్లకు శాపంగా మారింది. కస్టమ్‌ మిల్లింగ్‌ జరగక రైస్‌ మిల్లులు మూతపడగా, కార్మికులు పనిలేక రోడ్డున పడ్డారు. మరోవైపు, మిల్లుల వద్ద పేరకుపోయిన ధాన్యం నిల్వలు ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి.

Milling Rice Row: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ.. మిల్లుల వద్ద పేరుకుపోయిన ధాన్యం నిల్వలు..
Milling Rice

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం సేకరణకు ప్రతిబంధకంగా మారింది. రైస్‌ మిల్లుల్లో గుట్టలు గుట్టలుగా ధాన్యం నిల్వలు ఉండగా, వాటిని సకాలంలో మిల్లింగ్‌ చేయించకుండా ఎఫ్‌సీఐ రకరకాల కొర్రీలు పెడుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసింది. తిరిగి ఎప్పుడు మొదలు పెడుతుందో తెలియదు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా ఫలితం లేదు. దీంతో రైస్‌ మిల్లులకు తాళాలు పడుతున్నాయి. రైస్ మిల్లుల్లో నిల్వలు సక్రమంగా లేవని, ప్రొక్యూర్‌మెంట్ ఆడిట్ అస్తవ్యస్తంగా ఉందని, కొన్ని మిల్లులు తనిఖీలకు సహకరించలేదంటూ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను నిలిపివేసింది ఎఫ్‌సీఐ. దీంతో కస్టమ్ మిల్లింగ్ నిలిచిపోయింది. వాస్తవానికి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియే వివాదాస్పదంగా మొదలైంది. దేశంలో ఉప్పుడు బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఇకపై ఉప్పుడు బియాన్ని సేకరించబోమని, ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా ఆడిస్తే నూక శాతం ఎక్కువ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయినప్పటికీ కేంద్రం ససేమిరా అనడంతో గత్యంతరం లేక ముడి బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్రవ్యాప్తంగా 2,600 రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రైస్ మిల్లుల వద్ద గోదాములు లేకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి. కొన్ని చోట్ల ధాన్యం రంగు మారడంతో పాటు మొలకలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైసు మిల్లులపై ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల మంది కార్మికులు ఆధారపడ్డారు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. మిల్లులు మూతపడడంతో వారంతా రోడ్డున పడ్డారు. రోజు కూలీకి పని చేసే తాము 20 రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్, లెఫ్ట్ కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర, రాష్ట్రాల పంచాయతీ వల్లే బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్, లెఫ్ట్ కార్మిక సంఘాల నేతలు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామంటున్నారు.

ఉమ్మడి నల్లొండ జిల్లాలో 216 రైస్‌ మిల్లులు ఉండగా, వాటిలో 114 రైస్‌ మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తగా చాలా మిల్లుల్లో ఇదే పరిస్థితి. బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ వెంటనే ప్రారంభించి, మిల్లింగ్‌ జరిగేలా చూడాలని రైస్‌ మిల్లర్లు కోరుతున్నారు.

తెలంగాణ వార్తల కోసం