Virat Kohli: ‘నేను సెలక్టర్‌గా ఉంటే.. విరాట్‌ని ఎంపిక చేసేవాడినే కాదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన జడేజా..

విరాట్ కోహ్లీ సుమారు ఐదు నెలల తర్వాత టీమ్ ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అందరి దృష్టి అతనిపై మాత్రమే ఉంది. అయితే కోహ్లీ రెండో టీ20లో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు.

Virat Kohli: ‘నేను సెలక్టర్‌గా ఉంటే.. విరాట్‌ని ఎంపిక చేసేవాడినే కాదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన జడేజా..
Virat Kohli Bad Form

India Vs England T20 Series: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాడ్ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. మ్యాచ్‌ల వారీగా పరుగులు సాధించడంలో అతను చాలా కష్టపడుతున్నాడు. విరాట్ గత పది ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే 40+ పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ దిగ్గజాలు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తర్వాత తాజాగా అజయ్ జడేజా కూడా విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డాడు. ఓ టీవీ ప్రోగ్రామ్‌లో జడేజా మాట్లాడుతూ.. నేను టీమిండియా సెలక్టర్‌గా ఉంటే టీ20 జట్టులో విరాట్ కోహ్లీని ఎంపిక చేసేవాడిని కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జడేజాకు ముందు 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ, పేలవమైన ఆటతీరుతో అశ్విన్‌ను జట్టు నుంచి తప్పించగలిగినప్పుడు.. విరాట్ కోహ్లీని ఎందుకు తప్పించలేరంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు సునీల్ గవాస్కర్ కోహ్లీపై విమర్శలు చేశారు.

శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టీ20లో కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అతను అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లీష్ బౌలర్ రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్‌లో వైడ్ లాంగ్ ఆన్-డీప్ మిడ్ వికెట్ మధ్యలో డేవిడ్ మలన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

5 నెలల తర్వాత టీ20ల్లో రీ ఎంట్రీ..

విరాట్ కోహ్లీ సుమారు ఐదు నెలల తర్వాత టీమ్ ఇండియా తరుపున టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అందరి దృష్టి అతనిపై మాత్రమే ఉంది. అయితే కోహ్లీ రెండో టీ20లో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. కోహ్లీ పెవిలియన్ చేరిన వెంటనే అభిమానులు నిరాశకు గురయ్యారు.

మూడేళ్లుగా కోహ్లీ బ్యాట్ సైలెంట్..

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. మూడేళ్ల క్రితం వరకు భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా భావించిన కోహ్లీ బ్యాట్‌తో పరుగులు చేయడం లేదు. చివరి పది ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం ఒక ఫిఫ్టీ మాత్రమే కొట్టగలిగాడు. అతను రెండుసార్లు మాత్రమే 40+ స్కోర్ చేయగలిగాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు.

అనంతరం ఇంగ్లండ్‌ జట్టు 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ 35 పరుగులు చేశాడు. భారత్ తరపున భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.