Eknath Shinde: మహా సమరంలో అసలు ‘నాటక సూత్రధారి’ ఆయనే.. అసలు రహస్యం చెప్పిన సీఎం ఏక్నాథ్ షిండే..
తిగుబాటు ఎలా జరిగింది..? తిరుగుబాటు జరుగుతున్న సమయంలో రెబల్ నాయకుడు ఏకనాథ్ షిండే వ్యూహ రచన ఎలా చేశాడు..? ఎవరితో చర్చలు జరిపారు..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే..
మహారాష్ట్ర రాజకీయ శాంతించింది. శివసేన పార్టీలో జరిగిన తిరుగుబాటు ప్రభావం ముఖ్యమంత్రిని మార్చేసింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం (MVA) పతనం.. తిరుగుబాటు బీజేపీ-శివసేన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కీలకపాత్ర పోషించారు. అయితే ఈ తిగుబాటు ఎలా జరిగింది..? తిరుగుబాటు జరుగుతున్న సమయంలో రెబల్ నాయకుడు ఏకనాథ్ షిండే వ్యూహ రచన ఎలా చేశాడు..? ఎవరితో చర్చలు జరిపారు..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే మీడియాతో పంచుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏక్నాథ్ షిండే తెలిపారు. శివసేనలో ఇటీవల జరిగిన తిరుగుబాటు సమయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పాత్ర పోషించిందో.. దానిని రహస్యంగా ఎలా అమలు చేసిందో ఆయనే వెల్లడించారు.
“శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తాను ఇటీవల చేసిన ‘తిరుగుబాటు’ వెనుక బీజేపీ క్రియాశీల పాత్ర ఉందని ఏక్నాథ్ షిండే సోమవారం బహిరంగంగా చెప్పారు. గుజరాత్ నుంచి గౌహతి వెళ్లిన తర్వాత తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నిద్రిస్తున్నప్పుడు ఫడ్నవీస్‌ను కలిసేవారని.. అయితే ఎమ్మెల్యేలు నిద్ర లేవకముందే తిరిగి (గౌహతి) వచ్చేవారని చెప్పారు.
ఫడ్నవీస్‌తో రహస్య సమావేశమయ్యారు
ఈ కాలంలో షిండే నేతృత్వంలోని గ్రూపు కార్యకలాపాల్లో బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చురుకుగా పాల్గొన్నారని సభలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో షిండే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గత నెలాఖరున గౌహతిలోని ఓ లగ్జరీ హోటల్లో క్యాంప్ వేశారు. అయితే గౌహతి నుంచి గుజరాత్ చేరుకున్న తర్వాత ఫడ్నవీస్‌తో షిండే రహస్యంగా సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. తెల్లవారుజామున షిండే 40 మంది ఎమ్మెల్యేలతో గువాహటిలోని హోటల్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
షిండే మాట్లాడుతూ –
ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. “మా సంఖ్య (బీజేపీతో పోలిస్తే) చాలా తక్కువగా ఉంది. కానీ ప్రధాని మోదీ మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ సాహెబ్ నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని చెప్పారు. అమిత్ షా మా వెనుక నిలబడతారని అన్నారు.” ఫడ్నవీస్ వైపు చూపిస్తూ, “అయితే మహా చిక్కుముడి వీడటంలో కీలక పాత్రదారి మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని షిండే కుండ బద్దలు కొట్టారు.
ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, “నాతో ఉన్న ఎమ్మెల్యే నిద్రిస్తున్నప్పుడు మేము కలుసుకునేవాళ్ళం.. వారు మేల్కొనే వరకు (గౌహతి) తిరిగి వచ్చేవాళ్ళం.” షిండే వెల్లడిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఫడ్నవిస్ కొద్దిగా సిగ్గు పడ్డారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. “ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు.” కానీ అంతా సుకాంతం అయ్యిందని వెల్లడించారు సీఎం షిండే.